మోహన్ బాబుకు చిరు ఈ పని చేసిపెడతారా?
మోహన్ బాబు, చిరంజీవి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలు నటించారు. అందులో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ ని కూడా సొంతం చేసుకున్నాయి. ప్రతీ సినిమాలో వీరిద్దరి పాత్రలలో ఇద్దరూ పోటీ పడుతూ నటిస్తారు. హీరో పాత్రలో హీరో, విలన్ పాత్రలో విలన్ ఒకరితో ఒకరు పోటీ పడతారు. బిల్లారంగా, పట్నం వేసిన పతివ్రతలు ఇలాంటి సినిమాలలో వీరి పాత్రలంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. ఇలా ఎన్నో సినిమాలలో వీరి అద్భుత నటన చూపించారు. అయితే వీరిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. కానీ కొంతకాలం తరవాత వారిద్దరి మధ్య వార్ మొదలయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళు ఎప్పుడు వార్ లో ఉంటారో, ఎప్పుడు ఆలింగనం చేసుకుంటారో ఎవరికీ తెలియదు.
అయితే.. కొంత కాలంగా వీరి మధ్య స్నేహం మాత్రమే పరిమళిస్తోంది. ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరు కావడం.. ఒకరి గురించి మరొకరు పొగుడుకోవడం కూడా నడుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అర్థంకాని వాళ్లకు.. తమది ‘టామ్ అండ్ జెర్రీ’ రిలేషన్ అని పలు మార్లు చెప్పారు మెగాస్టార్. ప్రస్తుతం మోహన్ బాబు చేస్తున్న సినిమా ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్ కు వాయిస్ ఓవర్ అందించారు చిరంజీవి. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. చిరు వాయిస్ ను కేవలం టీజర్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. సినిమాలోనూ కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలన్నింటినీ మెగాస్టార్ తన వాయిస్ తో పరిచయం చేస్తారని సమాచారం. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారట మోహన్ బాబు. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారట మోహన్ బాబు. ఇదే నిజం అయితే ఈ కరోనా కష్టకాలంలో ఈ సినిమాకి ప్రమోషన్ కూడా చాలా బాగా జరుగుతుంది.