
ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా చీరలు, కానుకలు ఇస్తారనే ప్రచారంతో వాటిని అందుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం… చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పేదల చిన్న చిన్న ‘ఆశ’లే వారి ప్రాణాలు తీసేస్తున్నాయంటే వేదన కలగక మానదు. పేదవారి బలహీనతను ఆసరాగా తీసుకుని రాజకీయ పార్టీలు చేస్తున్న వికృత క్రీడలో చివరకు బలైపోతోంది అమాయకపు, పేద జనాలు మాత్రమే.
ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే కదా? తమ వారిని కోల్పోయినవాళ్లు ఆవేదన, ఆక్రందనలు పెద్దవారికి ఏమాత్రం పట్టవు. పైపెచ్చు ఇలాంటి ఉచితాల కోసం, కానుకల కోసం ఎవరు రమ్మన్నారంటూ విమర్శలు చేస్తుంటే కుటుంబ సభ్యుల్ని కోల్పోయినవారిని ఓదార్చేదెవరు? పరిహారం ఇచ్చి సాయం చేసామంటూ ప్రచారం చేసుకుంటున్నా… పోయిన ప్రాణాలు మాత్రం తెచ్చివ్వలేవు కదా? డబ్బులు వద్దు మా నాన్న కావాలంటూ కన్నీళ్లతో ఓ చిన్నారి మాటలు అందరి హృదయాల్ని కలిచివేసింది కూడా. ఆశకు అంతుండదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే ఇక్కడ పేదల బలహీనతే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. తప్పెవరిది అని మాట్లాడుకునే కన్నా మరోసారి అలాంటి విషాద ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్ని బాధ్యత ఎంతైనా ఉంది.
ఇక గుంటూరులో ఆదివారం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభ చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడటం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని విషయమే. నెల్లూరు జిల్లా కందుకూరు దుర్ఘటన మరిచిపోకముందే గుంటూరులో మహిళల ప్రాణాలు కోల్పోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బే. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం శోచనీయం.
రాజకీయ పార్టీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడికి దిగటం కాకుండా, సభలు, సమావేశాలకు వచ్చే వారిని తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలకు ఉంది. అంతేకానీ తొక్కిసలాటలో ‘చనిపోలేదు,చంపేశారు’ అంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాకుండా ఇక మీదటైనా సభలకు వచ్చే అమాయకుల ప్రాణాలు పోకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ప్రభుత్వ లోపం, ప్రతిపక్షం ప్రచార పిచ్చి అంటూ నెపం ఒకరి మీద మరొకరు నెట్టుకోకుండా లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని, పునరావ`తం కాకుండా చర్యలు తీసుకోవాలి.
ఇదేం ఖర్మరా బాబు
చీరల కోసం ఆశపడి వస్తే చివరకూ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, మీకు, మీ కానుకలకు ఓ నమస్కారం, అసలు కానుకలు ఇవ్వమని మేము ఏమైనా అడిగామా.. మాకు ఇదేం ఖర్మరా బాబు అంటూ బాధితులు అడిగే సూటి ప్రశ్నకు… తప్పంతా బాధితులపై నెట్టేసి తెచ్చివ్వలేని ప్రాణాలకు పరిహారంతో సరిపెట్టుకోవడం తప్ప సమాధానం చెప్పేదెవరు?