ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ పోలీసులకు పక్కా రిటర్న్ గిఫ్ట్ అంటూ అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదండోయ్ వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అప్పుడు అందరి సంగతి తేల్చుతానని చిందులు తొక్కుతూ ఖాకీలకు వార్నింగ్ లు కూడా ఇచ్చేశారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్. తన పట్ల అమానుషంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య గుడ్డలు చించారంటూ… ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని శాపనార్థాలు కూడా పెట్టేశారు.
పోలీసు యూనిఫామ్ ఊడిగం చేయడానికి కదా? నా గుడ్డలు చించే పనేముంది. రక్తదాన శిబిరానికి వెళుతుంటే అడ్డుకోవడానికి అదేమైనా నీ జాగీరా? ఆషామాషీగా ఉందా? రేపొద్దున రా నీ కతేంటో తేలుద్ది అంటూ డీఎస్పీ సత్యనారాయణపై అసహనం వెళ్లగక్కారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు చొక్కా చించివేశారని.. తనపట్ల అనుచితంగా ప్రవర్తించినవారిపై, ప్రతిగా రాబోయే రోజుల్లో ఇంతకు డబుల్ తీర్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు.
అధికార పార్టీకి ఊడిగం చేస్తున్న ఉద్యోగస్తులతో నన్ను అవమానపరిచారు. పోలీసు యూనిఫామ్ ఊడిగం చేయడానికి కదా? గుడ్డలు చించే పనేముంది. నా షర్ట్ చింపారని సంబరపడుతున్నారేమో… ప్రజాస్వామ్యం గుడ్డలు చింపుతున్నారు. మీరు అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది… గుర్తుపెట్టుకోండి. ఇది క్షమించరాని నేరం. ప్రతివారిని భయపెట్టడం చూస్తే మీరు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు.
సీక్రెట్ చెప్పేసిన చింతమనేని
ఇంతకీ తననే ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి కూడా చింతమనేని రీజన్ చెప్పేశారండోయ్. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు రోడ్డుకెక్కినా… టీడీపీ వాళ్లతో పాటు, ఇతర రాజకీయ పార్టీ నాయకులెవరైనా మీడియా ముందుకు వచ్చినా, చింతమనేని కి జరిగినట్లు జరుగుతుందని ఒక సిగ్నల్ పంపించారంటూ రహస్యాన్ని విప్పేశారు.
రేపు నీకు అదే బట్టలు ఉంటాయా?
‘ముఖ్యమంత్రి కళ్లు ఉన్న కబోధి. అధికారం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రజా క్షేత్రంలో ఉంది. నువ్వు కాదు…మీ తాత కూడా టీడీపీని ఏం చేయలేరు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు స్వేచ్ఛ ఉంది. హరిరామ జోగయ్యని పరామర్శించేందుకు వెళితే తప్పేంటి?, ఎందుకు వెళ్లకూడదు? పోలీసులతో కాపలా కాస్తారా? సర్ది చెప్పాలి, నచ్చచెప్పాలి. బట్టలు చించావు. రేపు నీకు అదే బట్టలు ఉంటాయా? నువ్వెప్పుడు తప్పు చేయలేదా? ఆ పాపం మీకు తగులుతుంది’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.
మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని దౌర్జన్యాలు, బెదిరింపులను జనాలతో పాటు అధికారులు కూడా అంత తేలిగ్గా మర్చిపోరు కదా? పవర్ లో ఉంటే ఒక న్యాయం … ప్రతిపక్షంలో ఉంటే మరో రీతి అన్నట్లుగా చింతమనేని ప్రవర్తన బహు విచిత్రంగా ఉంది కదా?