అనాలోచిత నిర్ణయాలకు…. అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..
శ్రీలంకలో మహీంద రాజపక్సే కుటుంబం తాము ఆడిందే ఆట, పాడిందే పాట చందంగా ఏకపక్ష అనాచిత నిర్ణయాలతో లంకను నిలువునా ఆర్థిక సంక్షోభంలో ముంచేశారు. గత ఏడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని వ్యవసాయ, ఆర్థిక సంక్షోభాన్ని లంక ఇప్పుడు ఎదుర్కొంటోంది. మరోవైపు ఆహార కొరత, భారీగా పెరిగిపోయిన ధరలు, నిరుద్యోగం, విదేశీ అప్పులతో సతమతమవుతోంది. ఛత్రపతి సినిమా స్టైల్‌లో చెప్పాలంటే.. ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..
లంక ప్రస్తుత పతనానికి కారణమైంది. రైతులకు ఏమాత్రం అవగాహన కల్పించకుండా గత ఏడాది నూరుశాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టడం ఆ దేశానికి శాపంగా మారింది. కీలకమైన రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించి.. రైతులతో బలవంతంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టడంతో.. మొదటికే మోసాన్ని తెచ్చింది..
వరి, టమోటా, క్యారట్, బీన్స్ తదితర పంటల దిగుమతి గత సెప్టెంబర్ నాటికి దారుణంగా పడిపోయింది. దీంతో ఆదాయం కోల్పోయిన రైతులు తిరగబడ్డారు. మళ్లీ పాత పద్ధతులకు మళ్లినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. చివరకు నూరు శాతం సేంద్రియ సాగు లక్ష్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు రాజపక్సే సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా.. ఫలితం లేకపోయింది.
మూలుగుతున్న నక్క మీద తాటిపండు చందంగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శ్రీలంకను మరింతగా దెబ్బతీసింది. కరోనా పరిస్థితులు కూడా టూరిజం మీద ఆధారపడుతున్న లంక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి..రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం.. లంకను కుదేలు చేసింది.. దీంతో పెట్రోలు, గ్యాస్ ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి..
ఉద్యోగాలు పోయాయి.. పైసా పని లేదు… తిండికి జనాలు అలమటించే పరిస్థితి..
దీంతో దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఏకంగా అధ్యక్ష కార్యాలయంలోకే చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
రాజపక్సే కుటుంబ పాలనే.. లంకలో ఈ పరిస్థితులకు కారణమన్న వాదన వినిపిస్తోంది.. ప్రస్తుతం మహీంద రాజపక్సే లంక ప్రధానిగా ఉండగా.. ఆయన తమ్ముడు గొటొబయ రాజపక్స అధ్యక్షుడిగా ఉన్నాడు. మరో తమ్ముడు బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నాడు. వీరి ఉమ్మడి అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు లంక ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి.. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది.. ద్రవ్యోల్బణం 17.5 శాతానికి చేరుకోవడంతో నిత్యావసర ధరలు పెరిగి సమాజంలో అశాంతి చోటుచేసుకుంది.. విదేశీ అప్పులతో దేశం దివాలా తీసే స్థాయికి చేరుకుంది.
కిలో చికెన్(CHICKEN 1000) వెయ్యి, కోడిగుడ్డు(EGG) 35 రూపాయలు.. కప్పు టీ(TEE 100) వంద రూపాయలు.. గ్యాస్ సిలిండర్‌కు మూడు వేల రూపాయలు.. ఇది లంకలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.. ప్రింటింగ్ కాగితాల కొరత వల్ల ఏకంగా పాఠశాల విద్యార్థుల పరీక్షలను రద్దు చేశారు.. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వినియోగదారులు క్యూ లైన్లో నిలబడుతుండటంతో.. వారిని అదుపుచేయడానికి బంకుల ముందు సైన్యాన్ని మోహరించింది.
ఈ దీనమైన పరిస్థితుల నడుమ.. శ్రీలంక ఉత్తర ప్రాంతాలైన జాఫ్నా, మన్నార్‌ల నుంచి తమిళులు పెద్ద సంఖ్యలో భారత్‌కు వలసబాట పడుతుడటం.. ఇటు మన దేశానికి ఆందోళన కలిగించే అంశమే.. ఇక, నిన్నమొన్నటి వరకు శ్రీలంకకు అండగా ఉన్న చైనా ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో భారత్ అండగా నిలిచి.. ఆ దేశానికి 7వేల 643 కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించింది. అంతేకాదు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. అలాగే చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన ఆర్ధిక సంక్షోభం శ్రీలంక తలెత్తడానికి గత రాజపక్ష సర్కారే కారణమని శ్రీలంక ప్రజలు నమ్ముతున్నారు. ఇక జులైలో భారీ నిరసనల నేపథ్యంలో లంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష దేశం నుంచి పారిపోయి సింగపూర్‌లో తలదాచుకుని అక్కడ నుంచే పదవికీ రాజీనామా చేశారు. ఇక అనేక సవాళ్లు, తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకను నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే గాడిలోకి తెస్తారా అనేది వేచి చూడాల్సిందే.
వై. పార్వతి